Saturday, 24 November 2018

కీ.శే.నరసింహదేవర వేంకటశాస్త్రి

సంగ్రహముగా కీ.శే.నరసింహదేవర వేంకటశాస్త్రిగారి జీవితచరిత్ర.

కీ.శే.వేంకటశాస్త్రిగారారామ ద్రావిడ శాఖకు చెందినవారు. శ్రీవత్స గోత్రులు.తాడేపల్లిగూడెము
తాలూకాలోని జట్లపాలెమను గ్రామములో మాతామహుని యింట జన్మించారు. పశ్చిమగోదావరీ మండల మందలి తణుకు తాలూకాలోని వెలగదుర్రు గ్రామము వీరి నివాసస్థానము.

క్రీ.శ.1828వ సంవత్సరం అంటే సర్వజిన్నామ సంవత్సర కార్తీక శుద్ధ విదియనాడు జన్మించి క్రీ.శ.1915వ సంవత్సరం అంటే రాక్షసనామ సంవత్సర శ్రావణ బహుళ పంచమిని నిర్యాణము చెందిరి. వేంకటశాస్త్రిగారి తల్లి సీతమాంబ(సుప్రసిద్ధ వైద్యులగు వరదావారి ఆడపడుచు),తండ్రి ఉమామహేశ్వరశాస్త్రి.వీరి సహధర్మచారిణి లక్ష్మీనరసమ్మ.వేంకటశాస్త్రి గారు విచిత్రరామాయణమనెడి  మహాకావ్యమును‌,గౌరీ శతకమును,వేంకటేశ్వర శతకమును,  విరాగసుమతీ సంవాదమును రచించారు. వీరి సంగీతప్రకర్షకు విరాగసుమతీ సంవాదమందలి కీర్తనలే తార్కాణములు.వేంకటేశ్వర శతకము వీరి తొలి రచనము.

వీరి నివాసగ్రామమునకు గొలది దూరంలో వశిష్ఠ గోదావరీతీరమున జినవాడపల్లి యను గ్రామంలో వేంచేసియున్న వేంకటేశ్వరస్వామినుద్దేశించి శృంగారరసప్రధానమగు
సీసపద్యములలో "విబుధనుత వాడపల్లీశ !వేంకటేశ! యను మకుటముతో దానిని రచించెను.కీ.శే.వేంకటశాస్త్రి గారికి వేంకటరత్నమ్మ యను నొక కుమార్తెయును,పరబ్రహ్మ
శాస్త్రి,పేరుశాస్త్రి,శేషయ్యశాస్త్రి వేంకటరమణశాస్త్రి, నారాయణ మూర్తి, ఉమామహేశ్వరశాస్త్రి యను నార్గురు కుమారులు నుండిరి.
వీరిలో రెండవ కుమారుడైన పేరుశాస్త్రిని తూర్పుగోదావరీ మండలములోని ఆలమూరు
గ్రామ నివాసియగు నరసింహ దేవర వేంకటశాస్త్రిగారికి దత్తుగానిచ్చిరి.కీ.శే.వేంకట
శాస్త్రిగారు మా అమ్మ సీతామహాలక్ష్మిగారికి ముత్తాత.రేపు వేంకటశాస్త్రి గారి వర్ధంతి.

ఈసందర్భముగా ఆయనకు  నివాళులర్పిస్తున్నాను.మన వంశపెద్దలను జ్ఞప్తికి తెచ్చు
కొనుచుండుట,స్మరించు చుండుట మన కర్తవ్యము, శ్రేయోదాయకము.మా పితృదేవతల పదకమలములకు శతకోటివందనములర్పిస్తూ...
--  శ్రీమతి అన్నపూర్ణ.

Friday, 23 November 2018

ఆయుర్వేద భిషక్ & వైద్య విద్వాన్ ద్విభాష్యం కాశీ విశ్వనాథం

శ్రీ ధన్వంతరయే నమః
నమామి ధన్వంతరి మాదిదేవం
సురాసురై వందిత పాద పద్మం!
లోకేజరారుగ్భయ మృత్యునాశం
ధాతారమీశం వివిధౌషధీనాం!!

                     శ్రీ ధన్వంతరి కరుణాకటాక్షముచే చింతలూరు ద్విభాష్యం వారి వంశములో ఆయుర్వేదవైద్య మనుస్యతముగా  వచ్చుచున్నది. సుప్రసిద్ధ వైద్యులు పలుతావులకు పల్లకీ మీద సయితం పయనించి అనేకరోగులకు ఆరోగ్యభాగ్యమును అందించిన  ఆయుర్వేద మహామహులు,  'వైద్య'    ద్విభాష్యం బుచ్చయ్య గారి కుమారులు,  ద్విభాష్యం వెంకయ్య గారి తరం నుండి చింతలూరు ఆయుర్వేద వైద్యవ్యాప్తి ప్రారంభమైంది. 'వైద్య' ద్విభాష్యం వెంకయ్య గారు తన నలుగురు కుమారులైన బుచ్చయ్య, వెంకటేశ్వర్లు, సుబ్బారాయుడు మరియు వెంకటాచలం గార్లకు ఆయుర్వేద విద్యావ్యాసంగమునొసగి, నిష్ణాతులను చేసి మూడవ తరమున కూడా ఆయుర్వేద వ్యాప్తిని కొనసాగించిరి. తండ్రి వెంకయ్య గారి ఆకాంక్షలను కొనసాగిస్తూ, వీరి నల్గురు తనయులు ఆయుర్వేద నిలయ స్థాపకులైన   'భిషగ్వరేణ్య'  ద్విభాష్యం బుచ్చయ్యగారు, 'వైద్యరాజ' ద్విభాష్యం  వెంకటేశ్వర్లు గార్లు, వీరి సోదరులు న్యాయకోవిదులు, ఆయుర్వేద నిలయ ఔషధ నిర్మాణ మరియు ఆయుర్వేద నిలయ కార్య నిర్వహణాదక్షులు మరియు చింతలూరు గ్రామాభివృద్ధికి, గ్రామప్రజలకు చుక్కానియై నిలచిన 'వైద్య' ద్విభాష్యం సుబ్బారాయుడుగారు,  ఈ మువ్విరి అడుగుజాడల్లో  ఆయుర్వేద ఔషధ వ్యాపారం  చేయుచూ  ఖ్యాతిని ఆర్జించిన  'వైద్య' ద్విభాష్యం వెంకటాచలం గారు.
అగ్రజులు  ద్విభాష్యం  బుచ్చయ్యగారి మరణానంతరం  వీరి సోదరులు 'వైద్యరాజ' ద్విభాష్యం వెంకటేశ్వర్లు గారు,  'వైద్య' ద్విభాష్యం సుబ్బారాయుడుగారు అవిశ్రాంతంగా  ఆయుర్వేద నిలయ ఔషధ ఖ్యాతిని ఆంధ్రదేశమున తమ బంధుగణాడ్యులతో వ్యాపార శాఖలతో విస్తరించి అఖండఖ్యాతిని ఆర్జించిరి. 

'వైద్య'  ద్విభాష్యం సుబ్బారాయుడు గారు

       మూడవ తరం న  'వైద్యరాజ' ద్విభాష్యం వెంకటేశ్వర్లు గారి కుమారుడు ద్విభాష్యం వెంకట సూర్యనారాయణమూర్తి, 'వైద్య' సుబ్బారాయుడు గారి కుమారుడు  ద్విభాష్యం కాశీ విశ్వనాథం గార్లు పెద్దల అడుగు జాడలలో నడుచుకొని ఆయుర్వేద విద్యావ్యాసంగము ఔషధ నిర్మాణ దక్షతను పూర్తి చేసుకొని మూడవ తరమున ఆయుర్వేద నిలయ ఖ్యాతికి రెండు కళ్ళు గా ఖ్యాతి గాంచిరి.
                    ఈ మూడవ తరమున ద్విభాష్యం కాశీ విశ్వనాథం గారు 'వైద్యవిద్వాన్' , 'ఆయుర్వేదభిషక్' పరీక్షలందు ఉత్తీర్ణులై ఆయుర్వేద నిలయ ఔషధనిర్మాణమునందు, రోగనిర్ణయనందు విశిష్ట ప్రతిభ కనబరిచి  తమ  పెదతండ్రి 'వైద్యరాజ' ద్విభాష్యం వెంకటేశ్వర్లు గారికి ప్రియంవదుడై,  ఆయుర్వేద నిలయం ఔషధ నిర్మాణ మరియు నిర్వాహణ బాధ్యతలను సునిశితంగా నిర్వహిస్తూ బంధుగణప్రీతితో వ్యాపార శాఖలను విస్తరించి చింతలూరు ఆయుర్వేద వైద్యమునకు వన్నె తెచ్చిరి.

ఆయుర్వేద భిషక్ & వైద్య విద్వాన్  ద్విభాష్యం కాశీ విశ్వనాథం గారు 
Founder  Chintaluru Ayuveda pharmacy 1984

                కాలానుగుణంగా నాల్గవ తరమున ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో 'వైద్యవిద్వాన్'  'ఆయుర్వేద భిషక్' ద్విభాష్యం కాశీ విశ్వనాథం గారు నిలయ బాధ్యలనుండి వైదొలగి, ఔషధ నిర్మాణం నందు, చికిత్సా విధానము నందు తనకు గల యేబదియేండ్ల  అనుభవముతో 1985సం.లో  చింతలూరు ఆయుర్వేద ఫార్మశీ అను నూతన సంస్థను చింతలూరు లో నెలకొల్పి, ఔషధ నిర్మాణమునందు, చికిత్స విధానమునందు మరియు వ్యాపార నిర్వాహణమనందు సమర్ధులైన కుమారుల సహకారముతో ఆయుర్వేదౌషధ వ్యాపారం కొనసాగించిరి. తమ బంధువులు, ఆయుర్వేద వైద్యసోదరులతో తమ వ్యాపార శాఖలు ఆంధ్రదేశము నంతటా విస్తరించి రోగుల చింతలు బాపే చింతలూరు గా ఖ్యాతి గాంచి  అనతికాలములోనే వైద్యసోదరులు, వైద్యాభిమానుల అభిమానమును చూరగొన్నారు.