Monday, 19 November 2018

కళాప్రపూర్ణ శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి


08/08/2018, మా ముత్తాత గారైనటువంటి - "కళాప్రపూర్ణ" "శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి" గారి 148వ జయంతి...!!!

నామధేయం : చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి
జననం : ఆగస్టు 8, 1870, కడియం
మరణం: 15 ఫిబ్రవరి 1950
ఇతర పేర్లు "తిరుపతి వేంకట కవులు", "జంట కవులు"

"జండాపై కపిరాజు", "బావా ఎప్పుడు వచ్చితీవు", "చెల్లియో చెల్లకో", "అలుగుటయే ఎరుంగని", "తమ్ముని కొడుకులు", "సంతోషంబున సంధిచేయుడు" అనే ప్రసిద్ధిగాంచిన పద్యాలు గుర్తుండే ఉంటాయి. ఇవి రచించిన జంటకవులలో వారే "శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి" గారు.
ప్రసిద్ధి: తెలుగు కవిత్వం, నాటకాలు, అవధానం (ప్రప్రథమ శతావధాని), పాండవ జనన- ఉద్యోగ - ప్రవాస - అశ్వమేధ - విజయాలు , శ్రీ కృష్ణ రాయబారం, కాశి యాత్ర, శ్రవణానందం, జాతక చర్య, ఇటీవలి చర్య , కింగ్ జార్జ్ V పట్టాభిషేక పద్యాలు, మృత్యుంజయ స్తవము మరెన్నో....
వీరు రచించిన పద్యాలు, నాటకాలు ఎన్నో తెలుగు చలన చిత్రాలలో వాడుకున్నారు.
"సూపర్ స్టార్" కృష్ణ నిర్మించి నటించిన "కురుక్షేత్రం" చిత్ర శీర్షికలలో "చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి" గారి పేరు వేసి గౌరవించారు.
**ప్రధమాంధ్ర ఆస్థానకవి చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి:**
------------------------------------------------------
అలనాటి మద్రాసు ప్రభుత్వం తొలి ఆస్థానకవిగా శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారిని 1949 లో నియమించింది. అవధాన విద్యకు రూపు రేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులులో ఒకరైన శ్రీ దివాకర్ల తిరుపతిశాస్త్రితో జంటగానూ, ఆయన మరణానంతరం విడిగానూ ఎన్నో పద్యనాటకాలు, కావ్యాలు, వచన రచనలు రచించారు. శ్రీ చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆయన శిష్యులుగా చదువుకున్నవారు చాలామంది ఆ తర్వాతి కాలంలో తెలుగు సాహిత్యరంగంలో, భాషాశాస్త్రంలోనూ కవులుగా, పండితులుగా ప్రఖ్యాతి పొందారు.
అలనన్నయకు లేదు తిక్కనకు లేదా భోగమస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దో
హల బ్రహ్మీమయమూర్తి శిష్యుడైనాడన్నట్టి దావ్యోమ పే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళ్ల వంశస్వామి కున్నట్లుగన్ ”
—విశ్వనాథ సత్యనారాయణ
గురువులపట్ల ఎనలేని గౌరవం ఉన్న విశ్వనాథకు తన ప్రతిభ పైన అపారమైన విశ్వాసం కూడా కలిగి ఉండేవాడు. తనంతటివాడు (అనగా విశ్వనాధ సత్యనారాయణ అంతటివాడు) శిష్యుడయ్యాడని చెప్పుకొనే భాగ్యం నన్నయ తిక్కనాదులకు లభించలేదని, చెళ్ళపిళ్ళవారికి దక్కిందని ఒకమారు తమ గురువుగారి సన్మాన సభలో అన్నారు విశ్వనాథ.
చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి ప్రమోదూత సంవత్సర శ్రావణ శుద్ధ ద్వాదశి సోమవారం అనగా 1870 ఆగస్టు 8న తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామంలో జన్మించారు. ఆయన ముత్తాత తమ్ముడు "వేంకటేశ్వర విలాసము", "యామినీ పూర్ణతిలక విలాసము" అనే మహద్గ్రంధాలను రచించిన పండితుడు. ఆయన సేకరించిన అమూల్య తాళపత్ర గ్రంథాలు వేంకట శాస్త్రికి అందుబాటులో ఉన్నాయి. తరువాత వారు యానాంకు మకాం మార్చారు. యానాంలో వేంకట శాస్త్రి తెలుగు, ఆంగ్లం, సంస్కృతం భాషలు అధ్యయనం చేశారు. కానుకుర్తి భుజంగరావు, అల్లంరాజు సుబ్రహ్మణ్య కవిరాజు వంటివారు వేంకటశాస్త్రి గురువులు. 18 ఏండ్ల వయసులో యానాం వేంకటేశ్వర స్వామి గురించి వ్రాసిన శతకంలో వ్యాకరణ దోషాల గురించి స్థానిక పండితులు విమర్శించారు. అది అవమానంగా భావించిన వేంకటశాస్త్రి సంస్కృత వ్యాకరణం నేర్చుకోవడానికి వారాణసి వెళ్ళాలని నిశ్చయించుకొన్నారు. కాని ఆర్థికమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ పై ఆయనకు పుట్టుకనుండి ఒక కన్నుకు సంబంధించిన సమస్య ఉండేది. తరువాత వేంకట శాస్త్రి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి వద్ద విద్యాభ్యాసం చేస్తున్నపుడు తిరుపతి శాస్త్రితో పరిచయం ఏర్పడింది.
వేంకట శాస్త్రి అధ్యాపకునిగా ఉన్నపుడు ఆయన శిష్యులుగా ఉండి, తరువాత సుప్రసిద్ధులైనవారిలో కొందరు - విశ్వనాధ సత్యనారాయణ, వేటూరి ప్రభాకర శాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, మరెందరో.
వీరు తమ గురువు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి ప్రోత్సాహంతో కాకినాడలో మొట్టమొదటిసారి జంటగా అష్టావధానాన్ని, ఆ తర్వాత 1890 అక్టోబరులో ఒక శతావధానాన్ని చేశారు. అయితే చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అంతకు ముందే కాశీయాత్ర కోసం అవసరమైన డబ్బు కొరకు పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు, గుండుగొలను గ్రామాలలోను, కాశీనుండి తిరిగి వచ్చిన తర్వాత గంగా సంతర్పణ కోసం ముమ్మిడివరం, అయినవిల్లి గ్రామాలలో అష్టావధానాలు చేశారు. కాకినాడ అవధానాల తర్వాత వీరిరువురూ చెలరేగి పల్లెల్లో, పట్టణాలలో, రాజాస్థానాలలో వందలకొద్దీ అవధానాలు చేశారు. కాకినాడ, అమలాపురం, ఏలూరు, బందరు, నెల్లూరు, విశాఖపట్నం, బెజవాడ, మద్రాసు, గుంటూరు, రాజమండ్రి మొదలైన పట్టణాలలోను, గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, వెంకటగిరి, విజయనగరం, నూజివీడు, కిర్లంపూడి మొదలైన సంస్థానాలలోను శతావధానాలు, అష్టావధానాలు, ఆశుకవితా ప్రదర్శనలు చేశారు.
అమ్మా! సరస్వతీ! నీ దయవలన మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన పద్యం:
ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స
న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మె
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్ర
జ్ఞా నిధులంచు బేరు గొనినాము, నీ వలనన్ సరస్వతీ!
కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, వీరు చెప్పిన పద్యం. దమ్మున్న కవులు ఎవరైనా మమ్ములను గెలిస్తే మీసాలు తీసి మొక్కుతామని:
దోసమటంచెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కలిగినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.
పాండవోద్యోగ విజయాలు - పడక సన్నివేశం
బావా! యెప్పుడు వచ్చితీవు? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్
నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుఖోపేతులే?
మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేల్గోరు ద్రోణాది భూ
దేవుల్ సేమంబై నెసంగుదురె? నీ తేజంబు హెచ్చించుచున్
బావ! ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరులున్ సుఖులే కదా?
యశోభాక్కులు నీదు అన్నలున్, భవ్య మనస్కులు నీదు తమ్ములున్ చక్కగనున్నవారే ?
భుజశాలి వృకోదరుడు అగ్రజాజ్ఞకున్ దక్కగా నిల్చి
శాంతు గతి తానూ చరించునే తెలుపుము అర్జునా, ఎక్కడి నుండి రాక?
పాండవోద్యోగ విజయాలు - రాయబారం
చెల్లియొ చెల్లకొ తమకు జేసినయెగ్గులు సైచిరందరున్
తొల్లి గతించె, నేడు నను దూతగ బంపిరి సంధి సేయ, నీ
పిల్లలు పాపలుం ప్రజలు పెంపు వహింపగ బొందు సేసెదో
యెల్లి రణంబు గూర్చెదవొ? యేర్పడ జెప్పుము కౌరవేశ్వరా!
జెండాపై కపిరాజు, ముందు సితవాజి శ్రేణియుం గూర్చి నే
దండంబుంగొని తోలు స్యందనముమీద న్నారి సారించుచుం
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పు డొ
క్కండున్ నీమొఱ నాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్
ఈ మహనీయుడు, 1950లో మహాశివరాత్రి నాడు శివసాయుజ్యం చెందారు. చాలా గొప్ప విశేషం ఏమిటంటే, వీరి పాండవోద్యోగ విజయాలలోని పద్యాలను, నటులు తప్పుగా చదివితే, ప్రేక్షకులు సవరించేవారు. అంత ప్రజా బాహుళ్యం చెందిన పద్యాలు అవి. ఈ నాటికీ ఉత్సాహవంతులైన నటులు, ఆ నాటకాలు ఆడుతూ, ఆ పద్యాలు పాడుతూ, అనుదినం వారిని మనకు గుర్తు చేస్తూనే వున్నారు.

--Subrahmanyam Chellapilla

1 comment: