Wednesday, 21 November 2018

వైద్యరాజ పాలంకి సూర్యనారాయణకవి

ఆరామద్రావిడ వంశజులు. అభినవధన్వంతరిగా ఆంధ్రదేశమంతా ఖ్యాతి గడించిన వారు.
వైద్యరాజ,ఆయుర్వేదోపాధ్యాయ,కవి బిరుదాంకితులు సాంకేతిక(టెక్నికల్) విద్యాధురీణులు.
వైద్యరాజ పాలంకి సూర్యనారాయణకవి- ఉప్పాడ (పిఠాపురం సమీపాన) వాస్తవ్యులు.
జీవితకాలము-31జనవరి 1884 నుండి 1జూన్1974


తెనుగు గణకముల ప్రకారము అధికమాసములు కలిపిన శతసంవత్సర ధన్యజీవి.
లలితా వుపాసనాసిధ్ధినొందిన దైవాంశ సంభూతులు.
లోహితసగోత్ర పవిత్ర వేంకటేశ్వరావధూత ప్రపౌత్ర,
నారాయణ పౌత్ర సూర్యనారాయణ ద్వితీయ పుత్రులు యీ వైద్యరాజ పాలంకి సూర్యనారాయణకవి.
భార్య సుబ్బమాంబ.(కాట్రేనికోనగ్రామ ఆణివిళ్ళవారి ఆడపడుచు.)



పేరెన్నికగన్న ఆయుర్వేద  ఘనవైద్యులు.అభినవ ధన్వంతరీ స్వరూపులు.
ఆంధ్ర,సంస్కృతభాషాకోవిదులు. బహుముఖ ప్రజ్ఞాశాలి.
పిఠాపుర కేంద్ర ఆయుర్వేద పీఠాధిపతులు.

వీరి రచనలు-
౧.వైద్యగ్రంథములు:
(అ.)అభినవ చికిత్సారత్నాకరము.
అద్భుత వైద్య ప్రక్రియ-కృష్ణమకుటముతో అతి శులభతరమైన తెనుగు పద్యరూపమున రోగమును గుర్తించుట,చికిత్స చేయుట, వ్యాధినివారణ(తగ్గిన వైనం పరీక్షా విధానము)ఈ పొత్తములోని పద్యముల  వివరణ.చికిత్సకు ఉపయోగించే మందులు
పరిసరాలలో చేతికనువుగా లభ్యమయ్యే వంటయింటి దినుసులు, మూలికలు,
మొక్కలతో రోగములను నయము చేయుట విశదీకరించి ప్రతివారూ యింటిలోనే వైద్యమును చేసుకొనవచ్చునను సదుద్దేశముతో వ్రాసిన వైద్యరాజము.ప్రతియింటా వుండదగినపుస్తకము. మొదటి ముద్రణ1949.పునర్ముద్రణకు ప్రయత్నము జరుగుతున్నది.

(ఆ) ఆంధ్ర శారీరశాస్త్రము-శ‌రీర అంతర్భాగముల విశదీకరణ. త్రివిధనాడులగతివిధానము.
(ఇ)స్వస్థవృత్తము-బాహాటాది శాస్త్రములననుసరించి దినచర్య,ఋతువులబట్టి  వనవిధానము. నిత్యోపయుక్త వస్తుగుణపాఠము సదాచార పధ్ధతి. దీనినే సూర్యనారాయణీయమందురు.
(ఈ) పంచకర్మ చికిత్స-వమనము,విరేచనము,స్వేదనము,నశ్యము,రక్తమోక్షణము.

౨ కవితలు:
అ. అపనిందాపహరణము-విఘ్నేశ్వర పూర్వగ్రంథ పూజావిధానము.
ఆ.  శ్రీరామస్తవరాజము.
ఇ. మల్లేశ్వర శతకము.
ఈ. శ్రీహరిశతకము.



(౩.)సాంకేతిక ప్రతిభ:
శతకంఠరామాయణమను గ్రంథమును తోలుబొమ్మలాటకు అనుగుణముగా రచించి
(తోలుబొమ్మలాటలు ప్రాచుర్యముగానున్న కాలము)
తోలుబొమ్మలను జంతు- చర్మములతో స్వహస్తములతో తయారుచేసి,ప్రకృతిసిధ్ధములైన
రంగులతో అలంకరించి వీటిని భాషాదోషములు లేని ప్రదర్శనకు (వాగ్దోషములకు రాజీపడని వ్యక్తి ) ఒక తోలుబొమ్మలాటల కుల కుటుంబమును యింట పోషించి వారికి పాండిత్యము‌‌,ఉఛ్ఛారణ, బొమ్మలను ఆడించే విధానమును స్వయముగా చేసి
చూపించి రమ్యమైన ప్రదర్శనలనిప్పించెడివారు. ఈ కటుంబములవారు వీరి
కీర్తితో వుత్తరాంధ్రమున నివసించుచున్నట్లు వినికిడి. ఈ ప్రదర్శనలు జనబాహుళ్యములో అధిక
ఆదరణతోనుండెడివి. ఢిల్లీ విశ్వవిద్యాలయమువారు పరిశోధనకు ఆసక్తి చూపించిన
గ్రంథము. అత్యంత భూతదయాపరులు.ఉప్పాడ గ్రామదేవత నూకాలమ్మ జాతరలలో జంతుబలులను  గ్రామవాసుల సహకారముతో  ఆపుచేయించి, స్వధనముతోనే అన్ననివేదన
సంతర్పణలతో సక్రమముగా  జరిపించెడివారు.ఉప్పాడ ఉన్నతపాఠశాలకు అద్యక్షులుగా
బాధ్యత వహించారు.చేనేతకు ఆలవాలమైన ఉప్పాడవాసులను  ఒక కుటుంబముగా జేర్చి ఖ్యాతి పొందిన చిరస్మరణీయులు. మన ఆరామద్రావిడ వంశజులకు తలమానికము కీ.శే.పాలంకి
సూర్యనారాయణకవి.వీరిని స్మ‌రించుటకు సదవకాశము కల్పించిన మన ఆరామద్రావిడ
కుటుంబ సభ్యులకు నమోవాకములు.

దౌహిత్రుడు నృసింహదేవర ఆదినారాయణమూర్తి,
భార్య అన్నపూర్ణ.

No comments:

Post a Comment